Monday, December 23, 2024

Prabhas-Sree Leela : శ్రీలీలతో ప్రభాస్‍ రొమాన్స్.. సినిమాకు దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ శ్రీలీల పేరు మారుమోగిపోతోంది. 2021లో ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ హీరోలకు ఈమె బెస్ట్ చాయిస్‌గా మారిపోయింది. ఈమె డేట్స్‌ కోసం దర్శక నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు.

ప్రసుతం రామ్ పోతినేనితో శ్రీలీల నటించిన ‘స్కంద’ సినిమా సెప్టెంబర్ 28, 2023న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో శ్రీలీల ప్రభా‌స్‌తో జోడి కట్టనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీబడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘సలార్’, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి’, మారుతీతో మరో ప్రాజెక్ట్ చేస్తుండగా.. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు.

దీంతోపాటు సీతారాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు హను రాఘవపూడితో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు ఇష్టమైన హీరో ప్రభాస్‌కు హను రాఘవపుడి ఇది వరకు కథ వినిపించినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చినప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పట్టాలెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే బాలయ్య లేటెస్ట్ సినిమా ‘భగవత్ కేసరి’ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించినట్లు టాక్. ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. మరోవైపు నవంబర్‌లో మెగా హీరోతో ‘ఆది కేశవ’ సినిమాలో కనిపించనుంది. మరో సినిమా డిసెంబర్‌లో నితిన్‌కు జోడీగా ‘ఎక్స్రార్డినరీ మ్యాన్’లో సర్‌ప్రైజ్ చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో వస్తున్న మహేశ్‌బాబు సినిమా ‘గుంటూరు కారం’ సినిమాలో ఈ యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా సందడి చేయనుంది. వీటితో పాటు విజయ్ దేవర కొండతో ఒక సినిమా, నవీన్ పొలిశెట్టితో మరో సినిమా రిలీజ్‌కు లైన్‌లో ఉన్నాయి.

దాదాపు శ్రీలీల చేతిలో 10 వరకూ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్‍లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అయిపోయింది. ధమాకా సినిమాలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో అవకాశాలు వచ్చి ఒళ్లో పడుతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక ప్రభాస్‍తో సినిమా అనేసరికి.. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు శ్రీలీల ఒపికకు ఫీదా అయిపోతున్నారు జనాలు.

Related Articles

Latest Articles