Monday, July 1, 2024

Iraivan Movie Review : ఇరైవన్ మూవీ రివ్యూ.. వీక్ మైండెడ్‍ వాళ్లు ఈ సినిమా చూడొద్దు

Iraivan Review : నయనతార, జయంరవి కాంబినేషన్లో వచ్చిన తమిళ సినిమా ఇరైవన్. ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించాడు.

నిర్మాత – ఫ్యాషన్ స్టూడియోస్
దర్శకత్వం – అహ్మద్
సంగీతం – యువన్‌శంకర్‌రాజా
నటీనటులు – జయం రవి, నయనతార
విడుదల తేదీ – 28 సెప్టెంబర్ 2023
సమయం – 2 గంటల 33 నిమిషాలు

తమిళ సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు OTT Telugu నుంచి ఒక విన్నపం. సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్, మహిళలపై లైంగిక వేధింపులకు కొన్ని సంవత్సరాల విరామం ఇస్తే మంచిదేమో. ఆడవారిపై అఘాయిత్యాలు చూపించడం, దారుణమైన హత్యలు, జుగుప్సాకరమైన సన్నివేశాలు, చెడు మాటలతో సినిమా తీస్తే.. సమాజానికి మంచిది కాదేమో. అఫ్ కోర్స్ మీరు సమాజంలో చూసిన ఘటనల ఆధారంగానే తీశాం అని చెప్పొచ్చు. కానీ ఇంకా ప్రోత్సహించొద్దు.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్(బ్రహ్మా) విలన్‍గా నటించాడు. విలన్ రాహుల్ బోస్ 12 మంది యువతులను కిడ్నాప్ చేసి 6 నెలల్లో దారుణంగా చంపేస్తాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీస్ అధికారులు అయిన జయం రవి(అర్జున్), నరేన్(ఆండ్రూ)కు బాధ్యతలు అప్పగిస్తాడు పోలీస్ కమిషనర్(ఆశిష్ విద్యార్థి). ఆ తర్వాత జరిగిన గొడవలో ఆండ్రూ చనిపోతాడు. తన స్నేహితుడి చనిపోవడం జీర్ణించుకోలేక తన పోలీసు ఉద్యోగానికి అర్జున్ రాజీనామా చేస్తాడు. అయినా యువతుల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తన సన్నిహితుడి అమ్మాయి కూడా కిడ్నాప్ అయి హత్యకు గురవుతుంది. మరోవైపు ప్రియ(నయనతార)తో కలిసి పని చేసుకుంటూ ఉంటాడు. ఆండ్రూ భార్యాపిల్లలతోపాటు ప్రియను ఎలా అర్జున్ కాపాడుకుంటాడు? హంతకుడు దొరికాడా లేదా అన్నదే మిగతా కథ.

జయం రవి ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాలో కూడా అదే కొనసాగించాడు. జయం రవి ఇలాంటి సినిమాల్లో నటించి తన ఫ్యామిలీ ఫ్యాన్స్ ను కోల్పోకూడదు. ఇక నయనతార ఈ సినిమాలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో కూడా తెలియకుండా నటించిందని అనిపిస్తుంది.

విరామం వరకు సైకో కిల్లర్‌గా రాహుల్ బోస్. ఆ తర్వాత అదే సైకో కిల్లర్ గా వినోద్ కిషన్. వినోద్ ఇంతకుముందు కూడా ఓ సినిమాలో ఇలాంటి పాత్రనే పోషించాడు. ఆశిష్ విద్యార్థి, అళగం పెరుమాళ్, చార్లీ, విజయలక్ష్మి వంటి ఎన్నో పాత్రలు సినిమాలో ఆసక్తిగా కనిపించవు. సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా తన సంగీతంతో సినిమాను కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు.

మేకలు, కోళ్లను ఎలా వధించి షాపుల్లో వేలాడదీస్తారో అదేవిధంగా యువతుల శరీరాలను ముక్కలు చేసి ఛిద్రం చేసినట్లు ఈ చిత్రంలో చూపించారు. విలన్ అసభ్య పదజాలంతో చులకనగా మాట్లాడుతుంటాడు. కొన్ని ప్లస్సులు ఉన్నా.. ఎక్కువ మైనస్సులే ఉన్నాయి.

లైట్ మైండెడ్ లేడీస్ దయచేసి ఈ సినిమా చూడకండి. తర్వాత అవే గుర్తుకువచ్చి ఇబ్బందులు పడుతుంటారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page