Rashmika Mandanna and Rakshit Shetty : కన్నడలో విడుదలయై సూపర్ హిట్ అందుకున్న రక్షిత్ శెట్టి సప్త సాగరదాచే ఎల్లో సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ సప్త సాగరాలు దాటి అనే టైటిల్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్న రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న గురించి మాట్లాడాడు.
రక్షిత్ శెట్టి ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలను కొడుతున్నాడు. 777 చార్లీ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ఇటీవల వచ్చిన సప్త సాగరదాచే ఎల్లో సినిమా కూడా హిట్ అయ్యింది. మాస్, కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి పెడుతున్నాడు రక్షిత్. భవిష్యత్తులో కూడా చాలా ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. తెలుగులోనూ కొత్త చిత్రాన్ని విడుదల చేశాడు రక్షిత్. సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.
రక్షిత్ ఈ చిత్రాన్ని తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదల చేశాడు. రక్షిత్ శెట్టి అండ్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. రష్మిక మందన్న తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ స్టార్. అందుకే రష్మిక మందన్న గురించి ఇంటర్వ్యూలలో రక్షిత్ శెట్టికి ప్రశ్నలు అడగడం సహజం. ఎందుకంటే వారిద్దరూ ఒకప్పుడు లవర్స్. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇంటర్వ్యూలో రష్మిక గురించిన ప్రశ్నకు రక్షిత్ సమాధానం ఇచ్చాడు.
రష్మికతో రక్షిత్ శెట్టి ఇంకా టచ్‌లో ఉన్నాడా? అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు నటుడు రక్షిత్ శెట్టి సమాధానమిస్తూ, అవును, మేము టచ్‌లో ఉన్నాం. ఆమె ఎప్పుడూ పెద్ద కలలు కనేది, ఇప్పుడు ఆమె ఆ కలలను నిజం చేస్తోంది.. అని చెప్పుకొచ్చాడు. ‘ఆమె గొప్ప విజయం అందుకుంది. అందుకు గర్వంగా ఫీలవుతున్నాను.’ అని రక్షిత్ శెట్టి చెప్పాడు. గతంలోనూ రష్మిక గురించిన ప్రశ్నలకు డిగ్నిఫైడ్ సమాధానం ఇచ్చాడు.
అదే ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమ, స్టార్ నటులు, రిషబ్ శెట్టి, పరమవ స్టూడియోస్ అండ్ పిక్చర్స్, తన చిత్రం సప్త సాగరాలు దాటి గురించి గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఇంటర్వ్యూ మధ్యలో రిషబ్ శెట్టికి ఫోన్ చేసి మాట్లాడాడు రక్షిత్ శెట్టి. వీరిద్దరి స్నేహం, వారి తదుపరి ప్రాజెక్ట్, మరెన్నో విషయాలు గురించి చెప్పాడు.
సప్త సాగరాలు దాటి చిత్రానికి హేమంత్ రావు దర్శకత్వం వహించగా, రక్షిత్ శెట్టి స్వయంగా నిర్మించాడు. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్. రుక్మిణి నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మొదటి పార్ట్‌ను విడుదల చేయగా, రెండో భాగం అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. రక్షిత్ శెట్టికి తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది.