Monday, July 1, 2024

Baby Movie in Tamil : తమిళ్‌లో బేబీ మూవీ రిమేక్.. శింబుతో ‘లవ్‌టుడే’ హీరోయిన్ రొమాన్స్‌!

ఇటీవల కాలంలో ఓ సినిమా ఒక వారం బాగా ఆడితే చాలు. అది హిట్ అయినట్లే. రెండు వారాలు ఆడితే బంపర్ హిట్ కొట్టినట్లే. కానీ అంతకుమించి ఆడింది బేబి సినిమా. చిన్న చిత్రంగా వచ్చి బంపర్ హిట్ కొట్టింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నలిచింది.

డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్లు ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తమిళంలో బేబీగా ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానాను తీసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోగా శింబును ఒప్పించినట్లు తెలుస్తోంది.

మన్మథ వంటి కల్ట్ మూవీస్‌తో తనదైన ముద్ర వేసుకున్న శింబు అయితేనే ఈ స్టోరీకి న్యాయం చేయగలుగుతాడని డైరెక్టర్ భావించాడట. దీనికి సంబంధించి మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగులో ఇది వరకు చాలా సినిమాలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు వచ్చినప్పటికీ ‘బేబీ’ స్టోరీలైన్ కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించడం అనే పాయింట్‌తో తెరకెక్కించారు. అదే సమయంలో ప్రేమించిన ఇద్దరు అబ్బాయిలను అమ్మాయి ఎలా మోసం చేసిందో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఈ సినిమాను చూస్తే ముగ్గురిలో ఎవరివైపు ఆలోచించినా వాళ్లు కరెక్టే కదా అనిపిస్తుంది. బేబీ మూవీని రూ.7.40కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా ఏకంగా రూ.90కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఈ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి. OTT లోనూ ఈ సినిమా ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ అంతటి విజయాన్ని అందించినట్లు తెలుస్తోంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే సినిమా ఎంత హిట్ అవుతుందో ‘బేబీ’ నిరూపించింది.

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక తమిళంలో కూడా తెలుగులో డైరెక్ట్ చేసిన సాయి రాజేష్, నిర్మాతగా వ్యవహరించిన ఎస్‌కేఎన్‌లే పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు తమిళ్‌లో ‘ఎస్‌టీఆర్-48’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో శింబు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఆ సనిమా పూర్తయ్యాక శింబు బేబీ సినిమాపై ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

మరో వైపు ‘లవ్ టుడే’ హిట్‌తో హీరోయిన్ ఇవానా ఫుల్ బిజీ అయిపోయింది. అమె ఇటీవల ‘లెట్స్ గెట్ మ్యారీడ్’(ఎల్‌జీఎం) సినిమాలో మీరా అనే పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాల్వన్, కాంప్లెక్స్‌ అనే రెండు తమిళ సినిమాలు, ‘సెల్ఫిష్’ అనే టైటిల్‌తో తెలుగు, తమిళంలో విడుదల కానున్న మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరి ఈ హీరోయిన్ శింబుతో జోడీ కట్టేందుకు ఒకే అంటుందో లేదో చూడాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles

You cannot copy content of this page