Wednesday, July 3, 2024

Vijay Deverakonda : రౌడీ ఫ్యాన్స్‌కు పండగే.. సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా!

Vijay Deverakonda New Movie : ప్రతీ సంక్రాంతి పండుగకు కొత్త సినిమాల హవా మామూలుగా ఉండదు. సంక్రాంతి వచ్చిందంటే సినిమా అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. అయితే 2024 సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు చిత్రాల విడుదలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ చేరిపోయాడు. తన కెరియర్‌లో 13వ సినిమాను గీతాగోవిందం డైరెక్టర్ పరశురాంతో VD13ను ఇప్పటికే ప్రకటించారు.

ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ఈరోజు ప్రకటించారు. VD 13 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయిందని, ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

సంక్రాంతి బరిలో సుమారు పెద్ద హీరోల సినిమాలో సందడి చేసే అవకాశాలుంటాయి. వారి మధ్యలో చిన్న సినిమాల హీరోలు సర్‌ప్రైజ్ చేసి హిట్‌ అందుకున్న సందర్భాలు లేకపోలేదు. సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సందర్భాలూ అనేకం. ఇప్పటికే రవితేజ ‘ఈగల్’, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘హనుమాన్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్‌బాబు కాంబోలో మూడోది అయిన ‘గుంటూరు కారం’ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయి.

వీటిలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరును బట్టి చూస్తే గుంటూరు కారం డౌటే.. అని అంటున్నారు. కానీ మిగతా రెండు సినిమాలు మాత్రం దాదాపు కన్ఫార్మ్ అయినట్లే. అదే టైమ్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడి’ సినిమా ఉంటుందన్నారు. కానీ ఇప్పటికే సలార్ విడుదలను ఇప్పటికే వాయిదా వేసి క్రిస్మస్‌కు రిలీజ్ చేసే యోచనలో మూవీ టీం ఉంది. కాబట్టి డేట్ మారినట్టే అనుకోవచ్చు.

ఇటీవల వచ్చిన టీజర్‌లో వాళ్లు 2024 రిలీజ్ అన్నారు తప్ప సంక్రాంతి రిలీజ్ అనలేదు. ఈ రేసులో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్‌లో, పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించారు.

ఒకవేళ ‘గుంటూరు కారం’ ఉన్నా దిల్ రాజుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీనికి కారణం దిల్‌రాజుకు సొంత థియేటర్స్ ఉండటమే. తాను చెబితే కాదనే డిస్ట్రిబ్యూటర్స్ లేరు కాబట్టి సంక్రాంతికి విజయ్ దేవరకొండ సినిమా ఆల్మోస్ట్ కన్ఫామ్‌ అనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రౌడీ హీరో చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇందులో దర్శకుడు గౌతమ్ తిన్నూరితో VD12, దర్శకుడు పరశురాంతో VD13 అప్‌డేట్స్‌ వచ్చాయి. ఇందులో VD12 నుంచి హీరోయిన్ శ్రీలీల పలు కారణాలతో తప్పుకోవడంతో రష్మిక నటించనున్నట్లు గుసగుసలు వినిపించాయి. దీంతో ఆ సినిమా వాయిదా పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రౌడీ బాయ్ వరుస సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే తన ఫ్యాన్స్ పై ఉన్న ప్రేమను అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. ఇటీవలే 100మంది ఫ్యాన్స్ కు రూ.లక్ష చొప్పున రూ.కోటి విలువ గల చెక్కులను అందజేసి ఫ్యాన్స్‌ పై తనకు ఉన్న ప్రేమను చూపించాడు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page