Monday, December 23, 2024

OTT Era : సినీ రంగంలో కొత్త అధ్యాయం ఓటీటీ.. ఇది ఎందుకంతా టేస్టీ!


OTT News Telugu : ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీలు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీ లవర్స్, ప్రేక్షకులు ఈ డిజిటల్ మాధ్యమాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి అందుకు కారణాలు, ఓటీటీల హవా ఎందుకు పెరిగిందనేదానిపై చిన్నపాటి విశ్లేషణ.

ఓటీటీ.. ప్రస్తుతం వినోద సామ్రాజ్యాన్ని ఎలాంటి పోటీ లేకుండా నిర్విర్వామంగా ఏలుతున్న పరాక్రమ చక్రవర్తి. సినీ రంగంలో చంద్రయాన్ 3లా విజయవంతం అవుతున్నాయి ఈ ఓటీటీలు. ఈ డిజిటల్ వేదికల గరించి తెలియని వారు లేరు.. నెటిజన్ అంతకన్నా ఉండడు. అంతలా అతి తక్కువ కాలంలోనే సినీ ప్రియులకు, సగటు సినిమా ప్రేక్షకుడికి ఎక్కేసింది
ఓటీటీలో రారాజు
మూడేళ్ల క్రితం ఓటీటీ అంటే.. అదేం టీ అనేవారు కొందరు. కరోనా టెస్ట్ సెంటర్స్, టీకా కేంద్రాలు అక్కడ ఉన్నట్లే ఓటీటీల గురించి కూడా తెలిసిన వారు కొందరే ఉండేవారు. అప్పుడు విదేశాల్లో ఎన్నో ఓటీటీలు ఉన్నా.. ఇండియాలో మాత్రం ఒక్క నెట్‍ఫ్లిక్స్ రారాజుగా, అందరికీ తెలిసినవాడిగా ఉండేది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‍డౌన్‍తో ఒక్కసారిగా ఓటీటీల హవా పెరిగిపోయింది.
కరోనా వల్ల మంచి జరిగిందా..? చెడు జరిగిందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ ద్వారా సినీ ప్రసార మాధ్యమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు అయింది. కాలానికి క్రీస్తూ పూర్వం, క్రీస్తూ శకంలా.. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్‍కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా.. సినిమా రంగంలో బిఫోర్ ఓటీటీ-ఆఫ్టర్ ఓటీటీలా చరిత్ర సృష్టించింది.
సినిమాకు భాష లేదు
ఓటీటీ రావడానికి ముందు వరకు ఏ ప్రాంతీయ భాషకు చెందిన వారు ఆ సినిమాలను థియేటర్‍లోకి వెళ్లి మాత్రమే వీక్షించేవారు. మహా అయితే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూసి తరించేవారు. కానీ, సినిమాకు భాషతో సంబంధం లేదని ఖండాంతరాలు దాటేలా చేశాయి ఓటీటీ సంస్థలు. ప్రపంచంలోని వాడుక భాషలన్నింటిలోని సినిమాలు, వెబ్ సిరీసులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి డిజిటల్ ప్లాట్ ఫామ్స్. సినిమా అనేది ఒక్కటే అని దానికి ఎలాంటి భాష లేదని పరోక్షంగా చూపాయి.
ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, కొరియన్ అంటూ భాషా బేధం లేకుండా డిఫరెంట్ కంటెంట్, విభిన్నమైన జోనర్లలో మూవీస్, సిరీసులను చూస్తున్నారు సినీ ప్రియులు, ప్రేక్షకులు. అయితే ఓటీటీల వల్ల థియేటర్లకు భారీ నష్టం కలుగుతోంది ఆ మధ్య ఓ చర్చ జరిగింది. నిజానికి ఓటీటీలతో సినీ రంగానికి, సినిమాలో నటించేవారికి, దానికోసం పని చేసేవారికి లాభమే తప్పా నష్టం లేదు.
కలర్ ఫొటో వంటి మూవీ
ఎందుకంటే, ఓటీటీల ద్వారా చిన్న బడ్జెట్ సినిమాలు రూపొందించవచ్చు. అతి తక్కువ వ్యయంతో చెప్పలేని కంటెంట్‍ను వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించవచ్చు. ఇక భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకోలేని నైపుణ్యం గల నటీనటులు, దర్శకులకు ఓటీటీ కంటే మించిన ప్లాట్ ఫామ్ లేదు. అందుకు ఉదాహరణే.. కరోనా సమయంలోనే ఖాళీగా ఉండటం వల్ల ఓటీటీ ద్వారా కలర్ ఫొటో వంటి మంచి సినిమాను చూడగలిగాను అని మెగాస్టార్ చిరంజీవిలాంటి వ్యక్తే చెప్పాడు.

ఓటీటీల ద్వారా మంచి సినిమాలు, నటీనటులు, క్రియేటివ్ జోనర్స్ చూసే అవకాశం వచ్చింది. దీంతో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఎప్పుడూ ఉండే మూసధోరణి సినిమాలను వ్యతిరేకిస్తున్నారు జనాలు. అలా అని థియేటర్లలో కూడా చిత్రాలు చూస్తున్నారు. కానీ, కంటెంట్ బాగుంటేనే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్నాయి. లేకుంటే తొలి రెండు మూడు రోజులకే నెగెటివ్ టాక్‍తో థియేటర్లలో నుంచి బయటకు వెళ్తున్నాయి. అలాంటి సినిమాలకు ఓటీటీల్లో ఆదరణ లభిస్తోంది.
మంచి హిట్ టాక్ వస్తే తప్పా థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. థియేటర్స్, మల్టీ ప్లెక్సుల్లో సినిమాను వీక్షించడం సగటు మధ్యతరగతి వ్యక్తికి భారంగా మారింది. థియేటర్స్ వెళ్లిన ఆడియెన్స్ కు కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు.

టేస్టీగా ఓటీటీలు
రెండు, మూడు వందలకు ఒక్క నెల సబ్‍స్క్రిప్షన్ (దాదాపు అన్ని ఓటీటీలు సబ్‍స్క్రిప్షన్ అందిస్తున్నాయి) తీసుకుంటే ఇంటిల్లిపాది సినిమాలను వీక్షించవచ్చు. ఓటీటీల ద్వారా సినీ రంగంలో కథల పరంగా అనూహ్య మార్పులు జరగడమే కాకుండా.. సగటు ప్రేక్షకుడికి ఖర్చులు కలిసివస్తున్నాయి. అందుకే ఓటీటీల రుచికి ప్రేక్షకులు దాసోహం అయ్యారు.

40కి పైగా ఓటీటీలు
ఇదిలా ఉంటే ఇండియాలో దాదాపు 40కిపైగా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా వినియోగించేవి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. వాటిలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‍ఫ్లిక్స్, ఆహా, జీ5, సోని లివ్, జియో సినిమా, సన్ నెక్ట్స్, బుక్ మై షో, యాపిల్ ప్లస్ టీవి, లయన్స్ గేట్ ప్లే, హోయ్‍చోయ్, ఎమ్ఎక్స్ ప్లేయర్, ఉల్లు యాప్, ఎయిర్‍టెల్ ఎక్స్ స్ట్రీమ్, స్పార్క్ ఇతర ఓటీటీలు ఉన్నాయి.

Related Articles

Latest Articles