Saturday, June 29, 2024

Kausalya Supraja Rama Movie Review : కౌసల్య సుప్రజా రామ సినిమా రివ్యూ.. అసలు మీరు మనిషేనా?

డార్లింగ్ కృష్ణ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కన్నడ నటుడు ఇతడు. లవ్ మాక్ టేయిల్ అనే సినిమాతో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. అతడు నటించిన చిత్రం కౌసల్యా సుప్రజా రామ. ఈ కన్నడ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే..

చిత్రం: కౌసల్యా సుప్రజా రామ

నిర్మాణం: కౌరవ ప్రొడక్షన్ హౌస్, శశాంక్ సినిమాస్

దర్శకత్వం: శశాంక్

తారాగణం: డార్లింగ్ కృష్ణ, మిలనా నాగరాజ్, బృందా ఆచార్య, రంగాయణ రఘు, సుధా బెలవాడి, నాగభూషణ్, అచ్యుత్ కుమార్ తదితరులు.

డార్లింగ్ కృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాడు. అలాగే దర్శకుడు శశాంక్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలే తీస్తాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘కౌసల్యా సుప్రజా రామ’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుందని ముందుగానే అందరూ ఊరించారు. ఈ సినిమా ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చాడు దర్శకుడు. డార్లింగ్ కృష్ణ, మిలనా నాగరాజ్ ఒకే సినిమాలో ఉంటే వారి ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఆ కోణంలో చూస్తే ‘కౌసల్యా సుప్రజా రామ’ సినిమా ప్రత్యేకం. ఈ సినిమాలో కథానాయిక బృందా ఆచార్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. రంగాయణ రఘు, సుధా బెలవాడి, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన కళాకారులు సినిమాకు మరింత మెరుగులు దిద్దారు.

అసలు మనిషి ఎవరు?
అమ్మాయిల ముందు తల వంచకూడదని పట్టుబట్టే రామ్ (డార్లింగ్ కృష్ణ) అలియాస్ రామేగౌడ కథ ఇది. తాను నిజమైన మనిషిననే గర్వంతో ఉంటాడు. ఈ సమయంలోనే శివాని (బృందా ఆచార్య) అనే అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ ఆ ప్రేమ తన మగతనం కారణంగా రామ్ జీవితంలో నిలవదు. అప్పుడు ముత్తులక్ష్మి (మిలనా నాగరాజ్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. కథ చివర్లో రామ్ అసలు నిజమైన మనిషేనా కాదా అనేది తెలుస్తుంది. అదే ఈ సినిమా సారాంశం. అసలు మనిషి ఎవరో కూడా ఈ సినిమా డిఫైన్ చేస్తుంది.

కుటుంబ విలువలు సినిమా
కుటుంబం నడవాలి అంటే భార్యాభర్తల పాత్ర చాలా ముఖ్యం. ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. కానీ మగవారు తామే ఉన్నతులమని అహంకారం చూపినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. అంత సీరియస్ సబ్జెక్ట్‌ని చాలా ఉల్లాసంగా హాస్యం ద్వారా వివరించాడు దర్శకుడు శశాంక్. కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని చూడగలిగే సినిమా ఇది. మగ జాతికి గొప్ప సందేశం ఇచ్చారు. ఆ మెసేజ్‌ని ప్రేక్షకులు మెప్పించే విధంగా సినిమా మొత్తం రూపొందించారు.

ప్రతిభావంతులైన కళాకారులు
కథానాయకుడి తండ్రి పాత్రలో రంగాయణ రఘు నటించాడు. కథలో ఆ పాత్ర చాలా కీలకం. అంత బరువైన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించాడు. అతని భార్యగా సుధా బెలవాడి నటన కూడా సినిమాకు మరింత మెరుపునిచ్చింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో డార్లింగ్ కృష్ణ నటన చెప్పుకోదగ్గది. మిలనా నాగరాజ్ చాలా బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది. ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ, మిలనా నాగరాజ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బృందా ఆచార్య నటన కూడా మెచ్చుకోవాలి. అలాగే నాగభూషణ్‌కి కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది. లాగే తను కనిపించిన ప్రతి సీన్‌లోనూ నవ్విస్తాడు.

శశాంక్ సినిమాల్లో పాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది ‘కౌసల్యా సుప్రజా రామ’ సినిమాలో కొనసాగుతుంది. అర్జున్ జన్య స్వరపరిచిన పాటలు సినిమాకు మెరుపునిచ్చాయి. ఈ సినిమాలోని నేపథ్య సంగీతం మెలోడ్రామాను మరింత పెంచింది. సుజ్ఞాన్ సినిమాటోగ్రఫీ చాలా అందంగా కుదిరింది. పురుషాధిక్య వ్యవస్థకు అర్థవంతమైన డైలాగులతో పంచ్ ఇచ్చాడు దర్శకుడు శశాంక్.

‘కౌసల్యా సుప్రజా రామ’ సినిమాలో చూపించేది రెండు కుటుంబాల గురించి మాత్రమే కాదు.. సమాజంలో దాదాపు అందరి ఇళ్లలోనూ ఇదే వాతావరణం ఉంటుంది. మగవాళ్ళు, పురుషాధిక్యత అనే భావనల వెనక ఉన్న భ్రమను తొలగించడంలో ఈ సినిమా కీలకం.

Related Articles

Latest Articles

You cannot copy content of this page