Monday, July 1, 2024

Kumari Srimathi Review : కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ రివ్యూ.. ఓ మహిళ బార్ పెడితే ఏం జరుగుతుంది?

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమారు 13 ఏళ్ల క్రితం నాని ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ. నిత్యామీనన్‌కు చెప్పుకోవడానికి లాస్ట్ సినిమా తెలుగులో బీమ్లా నాయక్. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలోనే కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ట్రెండీ బ్యూటీల దూకుడులో ఈ హీరోయిన్ వెనక్కి వెళ్ళిపోయింది. తాజాగా నిత్యా గేర్ మార్చి వెబ్ సిరీస్‌లపై పడింది.

నిత్యా తాజాగా నటించిన సీరీస్ ‘కుమారీ శ్రీమతి’. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో నిత్యా మీనన్‌‌తో పాటు గౌతమి, మురళీ మోహన్‌, నిరుపమ్‌, తిరువీర్‌ కీలక పాత్రలు పోషించారు. గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40నిమిషాల వరకు నిడివి ఉంది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..

ఏపీలోని తూర్పు గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. రామరాజు లంక అనే ఊరిలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెద్ద కూతురు శ్రీమతి(నిత్యామీనన్). అయితే, తన తాతయ్య ఇంటి కోసం ఆమె మేనమామ కేశవరావుతో గొడవ పడుతుంది. ఆ ఇల్లు బాబాయ్ పేరు మీద ఉండడంతో ఆమె కోర్టుకెళ్తుంది. శ్రీమతి కుటుంబానికి ఆస్తి రావాలంటే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.38లక్షలు చెల్లించాలని, దీనికి ఆరు నెలల గడువును ఇస్తూ కోర్టు తీర్పు వస్తుంది. దీంతో శ్రీమతి ఇల్లు కోసం డబ్బు సంపాదించడానికి ఎంత దూరం వెళ్తుంది? అందుకు బార్‌ను తెరవాలి అని నిర్ణయించుకొని ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? చివరికి ఆరు నెలల్లో రూ.38లక్షలు చెల్లించి ఇల్లు ఆమె సొంతం చేసుకుందా? హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటుందా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

సిరీస్ ఎలా ఉందంటే..
ఈ సిరీస్ ఫస్ట్ ‌ఎపిసోడ్ 20 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్‌తో మొదలవుతుంది. ప్రతీ ఎపిసోడ్ తొలి ఒక 5నిమిషాలు ఫ్లాష్‌బ్యాక్ ఉండే స్టోరీతో మొదలవుతుంది. సీరీస్‌లో స్కీన్‌ప్లే చాలా క్లియర్‌గా ఉంది. దానికి తోడు యాక్టర్స్‌ పర్ఫామెన్స్‌ మనం సిరీస్‌ను స్కిప్‌ చేయకుండా చేసింది. శ్రీమతి అనే రోల్ చాలా మొండి క్యారెక్టర్ అండ్ స్ట్రైట్ ఫార్వార్డ్. నిత్యామీనన్ చాలా బాగా నటించింది. లీడ్ యాక్టర్‌గా చేసిన మురళీమోహన్, గౌతమి, డాక్టర్ బాబు, ప్రణీత, రామేశ్వరి, నరేశ్ చాలా బాగా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత జడ్జి పాత్రలో బాబు మోహన్ నటించారు. కామెడీ క్యారెక్టర్ కాకున్నా ఆయన ఆ రోల్‌లో కనిపించడం చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెప్పుకునేంతగా ఏమీలేదు.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం తర్వాత స్వప్నదత్, ప్రియాంక దత్‌లు ఓటీటీలో మంచి సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారనే చెప్పాలి. ఎలాంటి అడల్డ్‌ కంటెంట్ గానీ, బూతులు గానీ లేవు. చాలా న్యాచురల్‌గా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడగలిగే సిరీస్ ఇది. నిత్యామీనన్ పక్కింటి అమ్మాయిలా కనిపించింది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. అక్కడి వాతావరణంతో పాటు పల్లెటూరిలో ఉండే పరిస్థతులు అక్కడి మనుషుల వ్యక్తిత్వాలను చక్కగా తెరకెక్కించారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలి అనుకునే ఓ ఇండిపెండెంట్ భావాలు ఉన్న అమ్మాయి కథ ఇది.

దీనికి కాస్త కామెడీని జోడిస్తూనే మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు. 30 ఏళ్ల వయస్సులో ఉన్న తన కుమార్తె వివాహం గురించి ఆందోళన చెందుతున్న తల్లి, తన ఇంటి నుంచి పారిపోయే బాధ్యత లేని తండ్రి, పూర్వీకుల ఆస్తిపై దృష్టి సారించే అవకాశవాద మామ, ప్రేమగా చూసుకునే సోదరి వంటి పాత్రలతో కుటుంబ నేపథ్యాన్ని చక్కగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ సీన్స్‌ క్లైమాక్స్‌లో బాగా తీశారు. థ్రిల్లర్‌ యాక్షన్ ‌ సినిమాలు చూసే వారికి ఈ సిరీస్ అంతగా నచ్చకపోవచ్చు.

హీరోయిన్ పాత్ర ఇందులో ఉద్యోగం కాదు వ్యాపారమే చేస్తానంటుంది. కుటుంబం మొత్తాన్ని తానే చూసుకుంటే అసలు పెళ్లే చేసుకోను అంటుంది. పెళ్లి గురించి అందరూ ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోని అమ్మాయి పాత్రలో నిత్యా కనిపించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఇందులో చూపించారు. పెళ్లి చేసుకోమని విసిగించే వారికి గట్టిగా సమాధానం చెప్తుంది. నీ కంటే చిన్నవాళ్లు పెళ్లి చేసుకున్నారు? నువ్వెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన ఓ బామ్మకు, నీ కంటే చిన్నవాళ్లు అప్పుడే పోయారు. నువ్వెప్పుడు పోతున్నావ్? అంటూ ముఖం మీదే కడిగిపారేసే మొండిఘటంలా కనిపించింది నిత్య.

శ్రీనివాస్ అవసరాల, రచయిత తన కెరీర్‌లో మొదటిసారిగా గ్రామీణ నేపథ్యంలో సాగిన కథకు రాసిన మాటలకు మంచి మార్కులే పడ్డాయి. శంకర్ దాదా MBBS తరహాలో తెలుగు సామెతలు కాస్త నవ్వు పుట్టిస్తాయి. త్వరగా డబ్బు సంపాదించడానికి బార్‌ను ప్రారంభించాలనే శ్రీమతి ఆలోచన, ఆమె తన హక్కుల కోసం ఎలా పోరాడుతుందో అద్భుతంగా చూపించారు. ‘కార్తీక దీపం’ ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్‌ ఈ సిరీస్‌లో శ్రీరామ్‌గా కనిపించాడు. నిరపమ్‌కు మంచి పాత్రనే చ్చినప్పటికీ డైలాగ్స్‌ ఎక్కువ ఇవ్వలేదు అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్‌లో కీలక పాత్ర తిరిగి రావడం కూడా ఆకట్టుకునేలా చూపించలేదు. తిరువీర్, నిరుపమ్, ప్రేమ్ సాగర్, రంగస్థలం మహేష్, అక్షయ్ లగుసాని వారివారి పాత్రల మేరకు న్యాయం చేశారు. చివర్లో రెండవ సీజన్ ఉండనుందని హింట్ ఇచ్చారు. ఒక డ్రామాటిక్ సిరీస్‌ను చూడాలనుకునే వారికి ‘కుమారి శ్రీమతి’ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page