Monday, July 1, 2024

Skanda Movie Review : స్కంద మూవీ రివ్యూ.. రామ్, బోయపాటి కాంబినేషన్ ఎలా ఉంది?

RAPO Skanda Movie Review Telugu : ఉస్తాద్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన స్కంద మూవీ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. చాక్లెట్ బాయ్‍లా ఉండే రామ్‍ని బోయపాటి ఎలా చూపిస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది? ఇంతకీ ఈ మాస్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా?

చిత్రం : స్కంద, నటీనటులు : రామ్, శ్రీలీల, మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు, సంగీతం : తమన్, ఎడిటింగ్ : తమ్మిరాజు, సినిమాటోగ్రఫీ : సంతోష్ దేటేక్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, పవన్, దర్శకత్వం : బోయపాటి శ్రీను.

కథ
ఈ సినిమా ఇద్దరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతుంది. ఆంధ్రా సీఎం కూతురు పెళ్లి పీటలపై కూర్చుంటుంది. తెలంగాణ సీఎం అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గొడవ మెుదలవుతుంది. ఒకరినొకరు నాశనం చేసుకోవాలని అనుకునేంతలా పగ పెంచుకుంటారు.

ఇదే సమయంలో ఏపీ సీఎం ఓ యువకుడిని(రామ్) రంగంలోకి దింపుతాడు. ఎవరినైనా ఎదురించే దమ్ము ఉన్న వ్యక్తి అతడు. ఎంతటి సెక్యూరిటీ ఉన్నా.. తెలంగాణ సీఎం ఇంట్లోకి వెళ్తాడు. అతడే ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుర్లను కిడ్నాప్ చేసి ఓ ఊరికి తీసుకెళ్తాడు. యువకుడు కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? ఆ ఊరికి ఎందుకు తీసుకెళ్తాడు? ఈ కిడ్నాపులకు ఓ పెద్ద కంపెనీ అధినేత(శ్రీకాంత్)కు ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ
బోయపాటి సినిమా అనగానే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ జాతర కచ్చితంగా ఉంటుంది. నరుకుడు ఉండాల్సిందే. లేదంటే ఆది బోయపాటి సినిమా కానే కాదు. చెప్పాలనుకున్న విషయాన్ని ఫ్యామిలీ డ్రామాకు ముడిపెట్టి.. కాస్త ఎమోషన్ పండించే ప్రయత్నం చేస్తాడు బోయపాటి. ఈ సినిమాలోనూ అదే చేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఎదుర్కొనేందుకు ఓ యువకుడు ఎంతటి దూరమైనా వెళ్తాడనే విషయాన్ని చూపించాడు. హీరో హీరోయిన్ల మధ్య కాలేజీ, డ్రామా, పాటలు, యాక్షన్, చిన్న చిన్న ట్విస్టులతో మెుదటి పార్ట్ నడిపించాడు. ప్రస్తుత రాజకీయాలపై కొన్ని చురకలు కూడా వేశాడు బోయపాటి.

రాహుల్, నవీన్, రామకృష్ణంరాజు పాత్రలను చక్కగా చూపించాడు. ప్రథమార్థంలో బోయపాటి మార్క్ మాస్ కనిపిస్తోంది. సెకండాఫ్ లోనూ బాగానే తీసుకెళ్తాడు కథను. కొన్ని కొన్ని సీన్లు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్ కథతో కాస్త ఆసక్తిని పెంచాడు.

తెలంగాణ, రాయలసీమ యాసను సరిగా పట్టుకున్నాడు రామ్. రెండు కోణాల్లోనూ ఆకట్టుకున్నాడు. పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది. పాత్రలో పరాకాయ ప్రవేశం చేశాడు. రామ్ డ్యాన్స్, ఫైట్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయి. ఇక శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుమ్మిపడేసింది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ముఖ్యమంత్రుల పాత్రలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. తమన్ మ్యూజిక్ బాగుంది. మెుత్తానికి సినిమా కథ, కథనం, హీరో ఎలివేషన్స్ తో కట్టిపడేశాడు. అయితే కథ మాత్రం అంత కొత్తగా ఏం అనిపించదు. కొన్ని సీన్లలో ప్రేక్షకుడు ఇబ్బందిగా ఫీలవుతాడు. రామ్‍ని ఇన్ని రోజులు చాక్లెట్ బాయ్‍లా చూసి.. ఇప్పుడు ఊర మాస్ హీరోగా చూడటం కాస్త ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రొటిన్‍గా అనిపిస్తాయి. మాస్ జాతరను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page