Monday, July 1, 2024

Peda Kapu-1 Movie Review : పెదకాపు 1 మూవీ రివ్యూ.. శ్రీకాంత్ అడ్డాల పొలిటికల్‌ యాక్షన్‌ సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: పెదకాపు 1, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, నటీనటులు: శ్రీకాంత్ అడ్డాల, విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, రావు రమేష్, రాజీవ్ కనకాల, నాగబాబు, ఆడుకలం నరేన్, ఈశ్వరి రావు, తదితరులు, సంగీతం: మిక్కీ జే.మేయర్, సినిమాటోగ్రఫీ: ఛోటా కే.నాయుడు, నిర్మాతలు: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ.

Peda Kapu-1 Movie Review telugu: ‘కొత్త బంగారులోకం’తో యూత్‌కు కనెక్ట్ అయ్యాడు..‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో పెద్ద హీరోలతో మల్టీస్టారర్ చేశాడు.. ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాల ప్లాఫ్‌తో శ్రీకాంత్ అడ్డాల డీలా పడిపోయాడు. ఆ తర్వాత హీరో వెంకటేష్‌తో నారప్ప సినిమాను తీసి కమ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇప్పుడు తను పుట్టిపెరిగిన నేటివిటీ ‘పెదకాపు’గా ఫుల్ పొలిటికల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ పొలిటికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ

ఈ సినిమా 1980లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సందర్భంలో మొదలవుతుంది. లంక అనే గ్రామంలో సత్యరంగయ్య(రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తుల పెత్తనం నడుస్తుంది. వీరు హింసను ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తులు. ప్రజలను బలి పశువులుగా చూసే క్రూరులు. పెద్దకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పనిచేస్తుంటాడు. అనుకోకుండా సత్యరంగయ్య తరపున పెద్దకాపు అన్న జైలుకు వెళ్తాడు. అలా జైలుకి వెళ్లిన పెద్దకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తారు.

ఈ క్రమంలో పెద్దకాపు టీడీపీ జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్యరంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెద్దకాపు వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చెలరేగడానికి కారణాలు ఏమిటి? ఈ కథలో కన్నబాబుగా నటించిన శ్రీకాంత్ అడ్డాల, అక్కమ్మగా నటించిన అనసూయ, పార్టీ ఇన్‌చార్జిగా నటించిన నాగబాబు పాత్రల స్వభావం ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ కథంతా గోదావరి జిల్లాల్లో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరఫున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సత్యరంగయ్య, బయన్న అరాచకాలు భయాన్ని పుట్టిస్తాయి. ఫస్టాఫ్‌లో ఈ సీన్లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు సాగతీతంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో సత్యరంగయ్య హఠాత్తుగా చనిపోవడంతో, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీతో సినిమా ఊపందుకుంటుంది. హీరో విరాట్ కర్ణ తొలి పరిచయమైనా అనుభవమున్న నటుడిగా నటించాడు. యాక్షన్ సీన్లలో చాలా సహజత్వం కనిపిస్తుంది.

కానీ భారీ డైలాగులు చెప్పడంలో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కథలో భాగంగా హీరోయిన్ ప్రగతి పాత్రకు అంత స్కోప్ ఇవ్వలేదు. అనసూయ నటనే ఈ సినిమాలో హీరోయిన్ మించి ఉంటుంది. అక్కమ్మ పాత్రలో అనసూయ నటన అద్భుతమనే చెప్పాలి. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్, బయ్యన్న పాత్రలో నరేన్ ఒదిగిపోయారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనికెళ్లభరణి, నాగబాబు, రాజీవ్ ‌కనకాల నటన సాధారణంగానే బాగుంది. సాంకేతికతంగా ఛోటా కె.నాయుడు కెమెరా పనితనానికి మెచ్చుకోవాల్సిందే. తన కెమెరాతో కొత్త గోదావరిని చూపించాడు. మిక్కీ జె.మేయర్ పాటలు చప్పగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీశాడు. సినిమా నిర్మాణ విలువలు చూస్తే నిర్మాతలు ఎక్కడా రాజీ పడనట్లు అనిపిస్తుంది. పొలిటికల్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page